మణిద్వీప వర్ణనం

విశేషం: నూతన గృహములు కట్టినవారు ఈ మణిద్వీపవర్ణనను తొమ్మిదిసార్లు పఠించినచో గృహమంతా శుభం కలుగుతుందని, అష్టైశ్వర్యాలతో తులతూగుతారని భక్తుల నమ్మకం.
మహాశక్తి మణిద్వీప నివాసినీ ముల్లోకాలకు మూలప్రకాశినీ । మణిద్వీపములో మంత్రరూపిణీ మన మనసులలో కొలువైయుంది ॥ 1 ॥
సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు । అచంచలంబగు మనో సుఖాలు మణిద్వీపానికి మహానిధులు ॥ 2 ॥
లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్సంపదలు । లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు ॥ 3 ॥
పారిజాతవన సౌగంధాలు సూరాధినాధుల సత్సంగాలు । గంధర్వాదుల గానస్వరాలు మణిద్వీపానికి మహానిధులు ॥ 4 ॥
భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము । దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ॥
పద్మరాగములు సువర్ణమణులు పది ఆమడల పొడవున గలవు । మధుర మధురమగు చందనసుధలు మణిద్వీపానికి మహానిధులు ॥ 5 ॥
అరువది నాలుగు కళామతల్లులు వరాలనొసగే పదారు శక్తులు । పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు ॥ 6 ॥
అష్టసిద్ధులు నవనవనిధులు అష్టదిక్కులు దిక్పాలకులు । సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు ॥ 7 ॥
కోటిసూర్యుల ప్రచండ కాంతులు కోటిచంద్రుల చల్లని వెలుగులు । కోటితారకల వెలుగు జిలుగులు మణిద్వీపానికి మహానిధులు ॥ 8 ॥
భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము । దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ॥
కంచు గోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు । ఏడామడల రత్నరాశులు మణిద్వీపానికి మహానిధులు ॥ 9 ॥
పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు । ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు ॥ 10 ॥
ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపుకోటలు వైఢూర్యాలు । పుష్యరాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు ॥ 11 ॥
సప్తకోటిఘన మంత్రవిద్యలు సర్వశుభప్రద ఇచ్ఛాశక్తులు । శ్రీ గాయత్రీ జ్ఞానశక్తులు మణిద్వీపానికి మహానిధులు ॥ 12 ॥
భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము । దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ॥
మిలమిలలాడే ముత్యపు రాశులు తళతళలాడే చంద్రకాంతములు । విద్యుల్లతలు మరకతమణులు మణిద్వీపానికి మహానిధులు ॥ 13 ॥
కుబేర ఇంద్ర వరుణ దేవులు శుభాల నొసగే అగ్నివాయువులు । భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు ॥ 14 ॥
భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు । సప్తృషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు ॥ 15 ॥
కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిల మహాగ్రహాలు । ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు ॥ 16 ॥
భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము । దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ॥
మంత్రిణి దండిని శక్తిసేనలు కాళి కరాళీ సేనాపతులు । ముప్పదిరెండు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు ॥ 17 ॥
సువర్ణ రజిత సుందరగిరులు అనంగదేవి పరిచారికలు । గోమేధికమణి నిర్మితగుహలు మణిద్వీపానికి మహానిధులు ॥ 18 ॥
సప్తసముద్రములనంత నిధులు యక్ష కిన్నెర కింపురుషాదులు । నానాజగములు నదీనదములు మణిద్వీపానికి మహానిధులు ॥ 19 ॥
మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు । సృష్టి స్థితి లయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు ॥ 20 ॥
భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము । దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ॥
కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు । పదారురేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు ॥ 21 ॥
దివ్యఫలములు దివ్యాస్త్రములు దివ్యపురుషులు ధీరమాతలు । దివ్యజగములు దివ్యశక్తులు మణిద్వీపానికి మహానిధులు ॥ 22 ॥
శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు । మణినిర్మితమగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు ॥ 23 ॥
పంచభూతములు యాజమాన్యాలు ప్రవాళసాలం అనేక శక్తులు । సంతానవృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు ॥ 24 ॥
భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము । దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ॥
చింతామణులు నవరత్నాలు నూరామడల వజ్రపురాశులు । వసంతవనములు గరుడపచ్చలు మణిద్వీపానికి మహానిధులు ॥ 25 ॥
దుఃఖము తెలియని దేవీసేనలు నటనాట్యాలు సంగీతాలు । ధనకనకాలు పురుషార్ధాలు మణిద్వీపానికి మహానిధులు ॥ 26 ॥
పదునాలుగు లోకాలన్నిటి పైన సర్వలోకమను లోకము కలదు । సర్వలోకమే ఈ మణిద్వీపము సర్వేశ్వరికది శాశ్వత స్థానమ్ ॥ 27 ॥
చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచముపైన । మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో ॥ 28 ॥
భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము । దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ॥
మణిగణఖచిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరిదాల్చి । సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపములో ॥ 29 ॥
పరదేవతను నిత్యముకొలచి మనసర్పించి అర్చించినచో । అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది ॥ 30 ॥
నూతన గృహములు కట్టినవారు మణిద్వీపవర్ణన తొమ్మిదిసార్లు । చదివిన చాలు అంతా శుభమే అష్టసంపదల తులతూగేరు ॥ 31 ॥
శివకవితేశ్వరి శ్రీచక్రేశ్వరి మణిద్వీప వర్ణన చదివిన చోట । తిష్టవేసుకుని కూర్చొనునంట కోటిశుభాలను సమకూర్చుటకై ॥ 32 ॥
భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము । దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ॥