లింగాష్టకం (Lingashtakam)

🙏
అక్షరాల పరిమాణం:
Shiva

లింగాష్టకం విశిష్టత (Significance)

శివ పూజలో లింగాష్టకానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. సాక్షాత్తూ బ్రహ్మ, విష్ణువులు కూడా శివలింగాన్ని పూజించారని ఈ స్తోత్రం తెలియజేస్తుంది. ఎవరైతే శివ సన్నిధిలో ఈ ఎనిమిది శ్లోకాలను భక్తి శ్రద్ధలతో పఠిస్తారో, వారు మరణానంతరం శివలోకాన్ని చేరుకుంటారని పురాణాలు చెబుతున్నాయి.


శ్లోకం 1

బ్రహ్మమురారి సురార్చిత లింగం
నిర్మలభాసిత శోభిత లింగం |
జన్మజ దుఃఖ వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం || 1 ||

ప్రతి పదార్థం (Meaning)

బ్రహ్మమురారి: బ్రహ్మదేవుడు మరియు విష్ణుమూర్తి చేత, సురార్చిత: దేవతల చేత పూజింపబడే, లింగం: శివలింగాన్ని, నిర్మలభాసిత: స్వచ్ఛంగా ప్రకాశించేది, శోభిత: శోభిల్లే దాన్ని, జన్మజ దుఃఖ: జన్మల వల్ల కలిగే దుఃఖాలను, వినాశక: నాశనం చేసే, సదాశివ లింగానికి (సదాశివ లింగం), నేను నమస్కరిస్తున్నాను (తత్ ప్రణమామి).

తాత్పర్యం (Full Meaning)

బ్రహ్మ, విష్ణువు మొదలగు దేవతలందరిచే పూజింపబడేది, ఎల్లప్పుడూ స్వచ్ఛంగా, ప్రకాశవంతంగా శోభిల్లేది, మరియు అనేక జన్మల నుండి వచ్చే సంసార దుఃఖాలను పారద్రోలేది అయిన ఆ సదాశివ లింగానికి నేను నమస్కరిస్తున్నాను.


శ్లోకం 2

దేవముని ప్రవరార్చిత లింగం
కామదహం కరుణాకర లింగం |
రావణ దర్ప వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం || 2 ||

ప్రతి పదార్థం (Meaning)

దేవముని: దేవతలు మరియు మునులచే, ప్రవరార్చిత: విశేషంగా పూజింపబడే, కామదహం: మన్మథుని దహించిన, కరుణాకర: కరుణను కురిపించే, రావణ దర్ప: రావణాసురుని గర్వాన్ని, వినాశన: అణచివేసిన శివలింగాన్ని.

తాత్పర్యం (Full Meaning)

దేవతలు మరియు గొప్ప మునులచే నిరంతరం పూజింపబడేది, మన్మథుని భస్మం చేసినది, భక్తులపై అపారమైన కరుణను కురిపించేది, మరియు రావణుని గర్వాన్ని అణచివేసిన ఆ సదాశివ లింగానికి నమస్కరిస్తున్నాను.


శ్లోకం 3

సర్వ సుగంద సులేపిత లింగం
బుద్ధి వివర్ధన కారణ లింగం |
సిద్ధ సురాసుర వందిత లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం || 3 ||

ప్రతి పదార్థం (Meaning)

సర్వ సుగంధ: అన్ని రకాల సువాసన గల వస్తువులచే, సులేపిత: పూయబడిన, బుద్ధి వివర్ధన: జ్ఞానాన్ని (బుద్ధిని) పెంపొందించే, సిద్ధ సురాసుర: సిద్ధులు, దేవతలు మరియు రాక్షసులచే మొక్కులందుకునే.

తాత్పర్యం (Full Meaning)

అనేక రకాల సుగంధ ద్రవ్యాలతో లేపనం చేయబడేది, భక్తులలో పవిత్రమైన బుద్ధిని, జ్ఞానాన్ని వృద్ధి చేసేది, మరియు దేవతలు, రాక్షసులు, ఎందరో సిద్ధ పురుషులచే నమస్కరింపబడే ఆ సదాశివ లింగానికి నేను విశేషంగా ప్రణామం చేస్తున్నాను.


శ్లోకం 4

కనక మహామణి భూషిత లింగం
ఫణిపతి వేష్టిత శోభిత లింగం |
దక్ష సుయజ్ఞ వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం || 4 ||

ప్రతి పదార్థం (Meaning)

కనక: బంగారు, మహామణి: గొప్ప మణులచే, భూషిత: ఆభరణాలుగా అలంకరింపబడిన, ఫణిపతి: సర్పరాజు అయిన వాసుకిని, వేష్టిత: చుట్టుకొని, దక్ష సుయజ్ఞ: దక్ష ప్రజాపతి చేసిన యజ్ఞాన్ని, వినాశన: నాశనం చేసిన.

తాత్పర్యం (Full Meaning)

స్వర్ణము మరియు ఎన్నో మణిమాణిక్యాలతో అలంకరింపబడి ఉండి, సర్పరాజు అయిన వాసుకిని ఆభరణంగా ధరించి శోభిల్లుతున్నది, మరియు దక్షుని యజ్ఞాన్ని నాశనం చేసిన శక్తిమంతమైన ఆ సదాశివ లింగానికి ప్రణామం చేస్తున్నాను.


శ్లోకం 5

కుంకుమ చందన లేపిత లింగం
పంకజ హార సుశోభిత లింగం |
సంచిత పాప వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం || 5 ||

ప్రతి పదార్థం (Meaning)

కుంకుమ చందన: కుంకుమ, గంధాలతో, లేపిత: పూయబడిన, పంకజ హార: తామర పూల మాలలతో, సుశోభిత: చక్కగా అలంకరింపబడిన, సంచిత పాప: పూర్వ జన్మలనుండి ప్రోగుచేసుకున పాపాలను, వినాశన: నశింపజేసే.

తాత్పర్యం (Full Meaning)

కుంకుమ మరియు మంచి గంధములతో పూయబడి, స్వచ్ఛమైన కమలముల హారాలతో అలంకరింపబడి అద్భుతంగా దర్శనమిచ్చేది, భక్తుల ఎన్నో జన్మల సంచిత పాపాలను పటాపంచలు చేసే ఆ సదాశివ లింగానికి నమస్కరిస్తున్నాను.


శ్లోకం 6

దేవగణార్చిత సేవిత లింగం
భావైర్భక్తిభిరేవ చ లింగం |
దినకర కోటి ప్రభాకర లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం || 6 ||

ప్రతి పదార్థం (Meaning)

దేవగణార్చిత: సకల దేవగణాలచే అర్చింపబడే, భావై: పవిత్రమైన భావాలతో, భక్తితో, పూజింపబడే వాడు, దినకర కోటి: కోటి సూర్యులంత, ప్రభాకర: కాంతి గల.

తాత్పర్యం (Full Meaning)

దేవగణాలచే నిరంతరం స్మరింపబడుతూ, భక్తులు కపటం లేని స్వచ్ఛమైన భక్తి భావములతో పూజించేది, మరియు కోటి సూర్యుల ప్రభతో ప్రకాశించే ఆ సదాశివ లింగానికి నేను నమస్కరిస్తున్నాను.


శ్లోకం 7

అష్టదళోపరివేష్టిత లింగం
సర్వసముద్భవ కారణ లింగం |
అష్టదరిద్ర వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం || 7 ||

ప్రతి పదార్థం (Meaning)

అష్టదళోపరి: ఎనిమిది దళాలు గల పద్మం ఫై, వేష్టిత: ప్రతిష్టితమై ఉన్న, సర్వసముద్భవ: చరాచర సృష్టి మొత్తానికి ఉద్భవ, కారణ పీఠమైన, అష్టదరిద్ర: ఎనిమిది రకాల దరిద్రాలను, వినాశన: తొలగించే.

తాత్పర్యం (Full Meaning)

అష్ట దళ పద్మంపై కొలువై ఉన్నది, ఈ చరాచర సృష్టి మొత్తానికి ఆధార భూతమై ఉన్నది, ఎనిమిది రకాల దరిద్రాలను మరియు కష్టాలను తొలగించే ప్రభావం గల ఆ సదాశివ లింగానికి నమస్కరిస్తున్నాను.


శ్లోకం 8

సురగురు సురవర పూజిత లింగం
సురవన పుష్ప సదార్చిత లింగం |
పరాత్పరం పరమాత్మక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం || 8 ||

ప్రతి పదార్థం (Meaning)

సురగురు: దేవతల గురువైన బృహస్పతి చేత, సురవర: దేవతా శ్రేష్ఠుల చేత, పూజిత: పూజింపబడే, సురవన పుష్ప: కల్పవృక్షం లోని పుష్పాలతో, పూజింపబడేవాడు, పరాత్పరమ్: అందరికంటే శ్రేష్ఠుడైన పరమాత్మ స్వరూపుడు.

తాత్పర్యం (Full Meaning)

దేవగురువైన బృహస్పతిచే మరియు ఇంద్రాది దేవతలచే పూజలందుకునేది, నందనవనంలోని దేవతా వృక్షాల పూలతో ఎల్లప్పుడూ అర్చింపబడేది, సర్వ స్వతంత్రంగా ప్రకాశించే ఆ పరమాత్మ స్వరూపమైన సదాశివ లింగానికి నమస్కరిస్తున్నాను.


ఫలశ్రుతి

లింగాష్టకమిదం పుణ్యం యః పఠేచ్ఛివసన్నిధౌ |
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ||

తాత్పర్యం (Full Meaning)

ఎవరైతే ఎంతో పుణ్యప్రదమైన ఈ లింగాష్టకాన్ని పరమశివుని సన్నిధిలో (లేదా మనసులో శివుని ఆరాధిస్తూ) భక్తితో పఠిస్తారో, వారు శివలోకాన్ని చేరుకుంటారు మరియు పరమశివుని సాన్నిధ్యంలో పొందే ఆనందంలో మునిగి తేలుతూ ముక్తిని పొందుతారు.